క్రమశిక్షణ

హాయిగా సాయంత్రం టీ తాగుతూ పోర్టికోలో కూర్చున్నాను..వేసవి ఎండలు తగ్గాయి..వాతావరణం చల్లగా ప్రశాంతంగా వుంది..మాయింటి యెదురుగా వుండే మైదానంలో బహుళ అంతస్థుల భవన నిర్మాణం జరుగుతోంది.. శబ్దకాలుష్యంతో బాటు జనసంచారం కూడా యెక్కువైంది..మాకు ఆకాస్తకే కాలుష్యం భరించడం విసుగ్గా వుంటోంది,సిటీ లోని హడావిడితో పోలిస్తే యిది యేమీ కాదు..ఏకాంతంగా వుండడం అలవాటై భరించలేకపోతున్నాము.. రోజూ గృహనిర్మాణ కూలీలు మాయింటి మీదుగానే రాకపోకలు సాగిస్తూ వుంటారు.. భార్యాభర్తా పిల్లాపాపల్తో వెళ్తూంటే

చూడముచ్చటగా వుంటుంది..మగవాళ్లు వారి వారి పనిముట్లు భుజానవేసుకుని గబగబా అంగలు వేసుకుంటూ నడుస్తూంటే,ఆడవాళ్లు….ముఖ్యంగా తల్లులు పిల్లల్ని చెయ్యిపట్టి నడిపించుకుంటూ నడుస్తూంటారు.. కొంతమంది పిల్లలు తండ్రి భుజాలు ఎక్కి ఠీవీగా దిక్కులు చూసుకుంటూ నవ్వుతూంటారు..మరికాస్త పెద్దపిల్లలు తండ్రి చెయ్యి పట్టుకుని నడుస్తూంటారు..తల్లితో నడిచే పిల్లలు మారాం చేస్తూంటారు..తల్లులు వాళ్లని బుజ్జగిస్తూమెల్లిగా వాళ్ల మారాములు వింటూనే పనికి ఆలస్యం అవకుండా వెళూంటారు..ఇవన్నీ చూస్తూ పోర్టికోలో కూర్చుని మేము కాలక్షేపం చేస్తూంటాము..అది మాకు చాలా యిష్టమైన సమయం..అలా ఒకరోజు సాయం సమయం కులాసాగా గడుపుతున్నాము.. ఒకతల్లి,పిల్లవాడితో పడుతున్న అవస్థ నాదృష్టిలో పడింది.. పిల్లవాడికి రెండేళ్ల వయసు వుండవచ్చు..ఏదో కావాలనీ,అప్పటికప్పుడు కొనిపెట్టమని మారాం చేస్తున్నాడు..తల్లి యిప్పుడు కాదూ తరవాత కొంటానని నచ్చచెప్తోంది..ఎంత చెప్పినా అసలు వినడం లేదు,తల అడ్డంగా తిప్పుతూ తన మారామూ,పేచీ కొనసాగిస్తూనే వున్నాడు,తల్లి చెయ్యి పట్టి ముందుకి నడిపిస్తూంటే రబ్బరులా సాగుతున్నాడు కానీ అడుగు ముందుకి కదపడే,,తల్లి యెంతో ఓపికగా సహనంతో బుజ్జగిస్తోంది.తల్లి చెప్తున్నకొద్దీ మారామూ పేచీ యెక్కువ చేసి,మట్టిలో కూలబడి,కాళ్లూచేతులూ తపతపలాడిస్తూ తన మారాము రాగం ఆరున్నొక్కరాగంలోకి శృతి పెంచాడు.తల్లి మొహంలో ఇంటికి వెళ్లడం ఆలస్యం అవుతోందన్న ఆదుర్దా స్పష్టంగా తెలుస్తోంది,నిజమే కదా! రోజంతా పని చేసి అలసి పోయింది ఆతల్లి,యింకా యింటికి వెళ్లాలి,వంట చేసుకోవాలి.తను విశ్రాంతి తీసుకోవాలి.మర్నాడు కాయకష్టానికి తయారవాలి కదా! పిల్లవాడిని ఎలా సముదాయిస్తుందా అని మేము చూస్తున్నాము. అన్ని విధాలా నచ్చచెప్పింది,తరవాత తప్పకుండా కొంటానని నమ్మకంగా చెప్పింది,ఐనా ముద్దుబిడ్డ మారాము మానడూ,మాట వినడూ.తల్లి వాడిని అదుపులో పెట్టవలసిన సమయం వచ్చిందని గ్రహించింది,వెంటనే కళ్లెర్రచేసి చెయ్యి యెత్తింది.అంతే వెంటనే పిల్లవాడు టక్కున నోరుమూసుకున్నాడు,తల్లి కేసి బిత్తరచూపులు చూస్తూ లేచి నిలబడి తల్లి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అమ్మ వదిలి వెళ్లిపోతుందేమో అన్న భయం వాడి కళ్లలో కనిపించింది. వెంటనే అమ్మ మళ్లా సౌమ్యంగా మధురంగా నవ్వింది. కొడుకు బట్టలకి అంటుకున్న దుమ్ము దులిపి ఎత్తుకుంది,ఆబుగ్గా ఈబుగ్గా గట్టిగా ముద్దులుపెట్టింది,నాబంగారుకొండ అంటూ వాడిని అక్కున చేర్చుకుని వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లింది. మాతృమూర్తి నేను మనసులోనే నమస్కరించాను,సహనానికి మారుపేరు స్రీమూర్తి కన్నతల్లి,మరి ఆమె సహనానికి పరీక్ష పెట్టి హద్దులు దాటే కన్న సంతానం, యెలా వారిని అదుపులో పెట్టి తిరిగి సరైన దారి చూపించి రాజబాట లో నడిపించాలి? ఈవిధమైన క్రమశిక్షణ తప్పనిసరి అనుకున్నాను.నాకు వెంటనే మనసులో భూమాత మెదిలింది,ఆమె మనకి కన్నతల్లి కదా! మనం అడగకుండా ప్రకృతి ద్వారా సకలఐశ్వర్యాలూ అందిస్తున్న తల్లి,మరి మనం ఏవిధంగా ప్రవర్తిస్తున్నాము? మన అంతరాత్మని ప్రశ్నిస్తే? జవాబు… ఆపిల్లవాడిలా మారాములు చేస్తున్నాము,ఆలోచన లేకుండా అవకతవక పనులతో భూమాతని అన్నివిధాలా కష్టపెడుతున్నాము. అడవులు నరికేసి,నగరాలు నిర్మించి,ప్రకృతి ద్వారా మనకి సమృధ్దిగా వున్న వనరులు దోచేసుకుంటున్నాము,కాదంటారా? అస్సలు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తుస్తున్నాము,భూమాత పట్ల మన నైతికబాధ్యత పూర్తిగా మర్చిపోయాము.తల్లి కళెర్రచేసి చెయ్యెత్తితే తట్టుకోగలమా? ఆచిన్న బుడతడి వలెనే బెంబేలెత్తి బిత్తరపోతాము,నిజముగా భూమాత మన మారాములు తట్టుకోలేకపోతోంది,క్రమశిక్షణ చూపిస్తోంది. వానలూ,వరదలూ,వేసవి గాడ్పులూ యివన్నీ తల్లి కోపారుణకిరణములే,ఈవిపరీతములకి కారణము మనమే,అమ్మని శాంత పరిచే బాధ్యత మనదే మరి కాదాంటారా? అమ్మ చిరునవ్వులూ,ఆప్యాయతలే మనకి తరగని సంపద,ఆసంపద పదిలంగా కాపాడి ముందు తరములకి అందించవలసిన భాద్యత మనదే అని మరువకండి, లేకపోతే భూమాత క్రమశిక్షణ తప్పించుకోలేము.జైహింద్

మీకృష్ణవేణి

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to క్రమశిక్షణ

  1. radharaopv అంటున్నారు:

    మంచి పరిశీలన.తల్లి తప్పకుండా పిల్లలకు క్రమశిక్షణ నేర్పాల్సిందే.ఆపరేషన్ చేసే డాక్టర్ లా చెడుని తొలగించాలి. గారాబం చేసేప్పుడు చెయ్యాలి.. అవసరం అయినప్పుడు కఠినంగా ఉన్నట్లు నటించాలి..అది వాళ్ల మంచి కోసమే. మితిమీరిన క్రమశిక్షణ, హద్దులు లేని గారాబం పిల్లలని పాడుచేస్తాయి.

  2. Ramana అంటున్నారు:

    Correct. Discipline is very important and it should be inculcated right from childhood.- Ramana

వ్యాఖ్యానించండి