నందిని 2

నందిని 2

“రేపు మధ్యాహ్నం వెళ్ళి రెజిష్ట్రేషన్ పని చేసుకుని వస్తాను” అని చెప్పి చలపతి గదిలోకి వెళ్ళిపోయాడు.  గేటుదగ్గర ఆటో ఆగింది. నందిని దిగి బాగుపుచ్చుకుని లోపలికి వచ్చింది. “వచ్చావా తల్లీ!” సుబ్బయ్య ఆనందంగా యెదురెళ్ళి నందిని చెయ్యిపట్టుకుని లోపలికి తీసుకుని వచ్చాడు.

“బాగున్నారా పెదనాన్నా” సుబ్బయ్య విపుమీద చెయ్యేసి పలకరించింది. “అందరం బాగున్నాం”.

“రా! నందినీ, రా! ” రత్నం వంటింటి గుమ్మందగ్గర నిలబడి నవ్వుతూ ఆహ్వానించింది.

“వదినా నీ వంటస్పెషల్సు గేటు దాకా సువాసనలు వెదజల్లుతున్నాయి”బాగు కిందపెట్టి రత్నం దగ్గరకు వెళ్ళింది.

“చిక్కిపోయావు వదినా!” ఆప్యాయంగా అంది.

“ఆఁ మరే! అందరికీ స్పెషల్సు చేసి చేసి మీ వదిన చిక్కిపోతోందమ్మా” వంటింట్లోంచి గౌరి వేళాకోళం ఆడింది.

“వంటింట్లో యేం చేస్తున్నావు పెద్దమ్మా! రా బయటికి” గౌరి మాట విన్న నందిని ముఖం ఆనందంతో విప్పారింది.

“అన్నయ్య యేడీ? “చుట్టూ చూసింది నందిని.

“ఇక్కడే వున్నాననమ్మా” అంటూ గదిలోంచి చొక్కా తొడుక్కుంటూ వచ్చాడు చలపతి. పలకరింతలూ, కుశల ప్రశ్నలూ అయ్యాయి. భోజనాలయ్యాక పడక్కుర్చీలో నడుం వాల్చాడు సుబ్బయ్య. “పెదనాన్నా!” నందిని వచ్చి పక్క కుర్చీలో కూర్చుంది.

“పెద్దమ్మ యేదీ?” చుట్టూ చూసింది. “మీ పెద్దమ్మకి మధ్యాహ్నం కునుకు అలవాటు కదమ్మా!”

“పెదనాన్నా”

“చెప్పుతల్లీ”

“నాకు పైచదువులకి ఫారెన్లో అవకాశం వచ్చేటట్లుంది. ఇంకా కొన్ని పరీక్షలు రాయాలనుకో. ఇప్పటివరకూ రాసిన పరీక్షల్లో మంచి రాంకులే వచ్చాయి”

“శుభం! నువ్వు యెప్పుడూ చదువుల సరస్వతివే! ఏదేశం వెళ్ళాలి?ఎన్నేళ్ళ చదువు?”. “ఇంకా అవన్నీ కన్ఫర్మ్ అవ్వలేదు. రెండు మూడు కంట్రీస్ కి అప్ప్లై చేస్తున్నాను. ఈలోగా పాస్‍పోర్ట్ రెడీగా వుంటే మంచిదికదా!”. “అవునమ్మా”

“దానికి అప్ప్లికేషన్ పెడుతున్నాను. మరేం పెదనాన్నా!”

“ఏమమ్మా యేమిటి నీ సందేహం? నువ్వు వెళ్ళడానికి మేము ఆటంకపెడతామనా?” సుబ్బయ్య అన్నాడు. “దూర దేశాలకు వెళ్తానంటున్నావు. మాకు బెంగే అనుకో, కానీ పైచదువులకి కదా!” మెల్లిగా అన్నాడు సుబ్బయ్య. ఒక్క క్షణం మౌనంగా వున్న నందిని మెల్లగా “పెదనాన్నా! పాస్‍ప్ర్టులో తల్లిదండ్రుల పేర్లు రాయాలి” అంది.

“ఓ! అదా! మీఅమ్మపేరు సుశీల. నీకు తెలుసు కదా! నాన్నపేరు, మేమందరమూ ‘రాఘవా’, ‘రాఘవుడూ’ అని పిలిచేవాళ్ళం. పూర్తిపేరు ‘రాఘవ రావు’.

నందిని సుబ్బయ్యకేసి సూటిగా చూసింది. “నా తల్లిదండ్రులు మీరే పెదనాన్నా” నందిని కంఠం వణికింది.

“మీరూ పెద్దమ్మా నాకు అమ్మా, నాన్నా అన్నీ”. సుబ్బయ్య వెంటనే యేమీ మాట్లాడలేకపోయాడు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

“పిచ్చితల్లీ! ‘నందిని’ తల నిమిరాడు. “మీ నాన్నకి మీ అమ్మంటే వల్లమాలిన ప్రేమ తల్లీ. భార్య యెడబాటు తట్టుకోలేకపోయాడమ్మా!”. అతని గొంతుక ఆ ఙ్ఞాపకాలతో పూడుకుపోయింది. “భార్య చావుకి తనే కారణమని ఉమిలిపోయాడు. కానీ నువ్వు పుట్టడం అని అనుకోలేదు”. నందిని చేతులు జోడించింది. పెదనాన్నా! నేను యెవ్వరినీ విమర్శించడంలేదు. భార్య మరణం తట్టుకోలేని ప్రేమికుడు అనుకోవాలో, కూతురి బాధ్యత స్వీకరించలేని బలహీన మనస్కుడనుకోవాలో నాకు తెలియదు.” సుబ్బయ్య వళ్ళో తలపెట్టుకుంది.

“అమ్మ లేదన్న నిజం తెలుసు పెదనాన్నా! కానీ నా కన్నతండ్రి యెక్కడ వున్నాడో, అసలు వున్నాడో లేడో తెలియని పరిస్థితి నాది”

“నందినీ అలా అనకమ్మా. మీ నాన్న యెప్పటినైనా తిరిగి వస్తాడు” సుబ్బయ్యకళ్ళనీరు కారుస్తూ అన్నాడు.

“ఆరోజు వస్తే అది మనకి నిజమైన పండుగ రోజు” లేచి తిన్నగా కూర్చుంది నందిని. “పాస్‍పోర్టులో మీ పేరు పెద్దమ్మ పేరూ రాస్తాను. మీరు మనస్ఫూర్తిగా అంగీకరించండి పెదనాన్నా!”

“అదేమిటమ్మా! కన్నవాళ్ళ పేర్లు రాయాలిగానీ……”

“నన్ను ఒళ్ళో పడుకోపెట్టుకుని నామకరణం చేశారు; ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాయసం నాకించి అన్నప్రాశన చేశారు; పలకా బలపం పట్టించి అక్షరాభ్యాసం చేశారు” ఆవేశంగా అంది “నాకు కనిపించే దైవం, అమ్మా, నాన్నా అన్నీ మీరే” వెక్కివెక్కి యేడ్చింది నందిని. అప్పుడే నిద్రలేచి వస్తున్న గౌరి నందిని యేడుపు వింది. గబగబా దగ్గరకొచ్చి కొంగుతో నందిని కళ్ళూ, మొహం తుడిచింది.

“ఊరుకో అమ్మా! మొహంచూడు యెలా కందిపోయిందో.” విషయం తెలియకపోయినా నందినిని అక్కున చెర్చుకుని ఓదార్చింది. “లేచి మొహం కడుక్కుని రా తల్లీ” నందిని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. సుబ్బయ్య ఆళోచనగా కూర్చుండిపోయాడు. నందిని మాటలు అతన్ని తీవ్రంగా గాయపరిచాయి. కానీ ఆమెని తప్పు పట్టలేకపోయాడు. అలాగని తమ్ముడినీ నిందించలేకపోయాడు. కన్నవాళ్ళ ప్రేమకి నోచుకోని నందిని పట్ల జాలితో నిట్టూర్చాడు; ఏనాడూ తన మనసులోని భావాలు బయటపెట్టని నందిని ఈ రోజు ఒక్కసారిగా బాధంతా వెళ్ళగక్కేసింది. గౌరితో లోపలికి వచ్చిన నందిని తిన్నగా బాత్రూమ్ లోకి వెళ్ళి మొహంకడుక్కుని వచ్చి వంటింట్లో కూర్చుంది. రత్నం యేదో టిఫిన్లు చేస్తూ హడావిడిగా వుంది. చలపతి , గౌరి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని వున్నారు.

“వదినా! మళ్ళా యేమిటి చేస్తున్నావు” అని అడిగింది నందిని. “మీ వదినకి వంటిల్లు ఒక పెద్ద కాలక్షేపం” చలపతి నవ్వుతూ అన్నాడు. “వచ్చే వారం వేణు వస్తున్నాడు కదా! వాడికి చేగోడీలంటే యిష్టం” చేగోడీ చుడుతూ అంది రత్నం.

’ఆ రెండో స్టౌమీద యేదో వుంది?” ఆరాగా అడిగింది గౌరి. “అదా! సేమ్యా ఉప్మా చేశాను. వుంటే రాత్రి టిఫిన్‍కీ పనికొస్తుంది”. “సర్లే! మా అత్త చేగోడీలు చూసిందంటే యింక సేమ్యా ముట్టుకోదు” గౌరి ఫక్కుమని నవ్వింది. గౌరి సుబ్బయ్య మేనమామ కూతురే. అత్తగారైన మేనత్తని యేదో వేళాకోళం చేస్తూ వుంటుంది. మంగమ్మా యేవీఁ పట్టించుకోదు, నవ్వేస్తుంది.

నందిని తనతో చెప్పిన మాటలు గౌరితో చెప్పాడు సుబ్బయ్య. “యింత బాధ యిన్నాళ్ళూ మనసులో దాచుకుంది పిచ్చి పిల్ల” అన్నాడు. “అవును అంతే కదామరి! చదువుల తల్లి మన నందిని” అంది గౌరి. “పాస్‍పోర్టులో మనపేర్లు రాస్తానంటోంది. ఆ మాట చెప్పి మన అంగీకారం తీసుకోడానికే యిప్పుడు వచ్చింది” ఒక్క క్షణం మౌనంగా వుండిపోయింది గౌరి.

“సరే! మనం కాదని పిల్ల మనసు నొప్పించలేము. పెళ్ళాం పోయిన రోజునే దురదృష్టవంతుడయ్యాడు మన రాఘవుడు”

 కన్నప్రేమలో ఒక విధమైన హక్కు, స్వంతం అన్న అధికారం వుంటుంది.

కానీ పెంచిన మమకారం మాత్రం యేం తక్కువ కాదు; చాలా గొప్పది.

అందులో ఆపాయత, అనురాగం పొంగి ప్రవహిస్తూ వుంటాయి.

అందులో తిరిగి ఆశించేది యేదీ వుండదు. అధికారం అసలే వుండదు.

సుతిమెత్తగా వెన్నెలంత చల్లగా వుండేదే పెంచిన ప్రేమ.

           నందిని, సుబ్బయ్య, గౌరిల అనుమతి తీసుకుని ఆ మర్నాడే తిరిగి వెళ్ళిపోయింది. చలపతి పొలం బేరం సెటిల్ చేసుకుని కొనేశాడు. దసరాలూ, హడావిడీ అయ్యింది. చలపతి పిల్లలు వేణు, శైలు సెలవలకి వచ్చి వెళ్ళారు. ఆ వారంరోజులూ అందరికీ సరదాగా, సందడిగా గడిచాయి. దీపావళి గూడా సందడిగా జరిగింది. కార్తీకమాసం చలిరోజులు మొదలయ్యాయి. ఆ నెలంతా గౌరికి హడావిడే. తెల్లారి చన్నీళ్ళ స్నానాలూ, రోజంతా ఉపవాసాలూ, వద్దని యెంత చెప్పినా వినడం లేదు.

ఆ రోజు కార్తీక సోమవారం. రోజంతా ఉపవాసంతో గడిపి సాయంత్రంకి మడిగానే వంట మొదలుపెట్టింది గౌరి. రత్నం పైపనులు చక్కపెట్టుకుంటూ వంటిల్లు అత్తగారి మడికి వదిలేసింది. కూర కలియబెట్టి వెనక్కి తిరిగిన గౌరి తన చీరకొంగు స్టౌకి తగలి అంటుకోవడం చూసుకోలేదు. వీపుమీద వేడిగాసెగలు తగలగానే తల వెనక్కి తిప్పి చూసుకుంది. కళ్ళయెదురుగా చీరకొంగుకి మంట చూసింది. అంత దగ్గరగా మంట చూసేసరికి తల తిరిగినట్లయ్యింది, కళ్ళు చీకట్లు కమ్ముతుంటే ‘కెవ్వు’మని కేకపెట్టింది. ఉపవాసంతో వుందేమో నీరసం వచ్చి తూలి పడిపోయింది. అక్కడే కూరలు కడిగి ఫ్రిజ్లో సర్దుతున్న రత్నం వులిక్కిపడి లేచి గౌరి దగ్గరికి పరుగున వచ్చింది. అప్పటికే గౌరికి నీరసం గాభరాతో స్పృహ తప్పిపోయింది. గబగబా చీరకొంగునలిపి మంట ఆర్పేసింది రత్నం. మడికోసం గౌరి కట్టుకున్న పట్టుచీర బాగా అంటుకుని వీపంతా దాదాపుగా కలిపోయింది. రత్నంకి యేం చెయ్యాలో తోచలేదు. గబగబా పక్కనే బిందెలో వున్న నీళ్ళుతీసి గౌరిమీద పూర్తిగా వంపేసింది.

“అత్తయ్యా! అత్తయ్యా!” అంటూ తట్టింది. నీరసంగా కళ్ళు తెరిచింది గౌరి. చుట్టూ చూసింది. నీళ్ళు, నల్లగా నుసితో కారుతున్నాయి. బట్టకాలిన వాసన., కొంగు పూర్తిగా కాలిపోయింది. నీళ్ళుపొయ్యడంవల్ల చలికి వణికుతోంది. గాభరా, షాకువల్ల కాళ్ళూ, చేతులూ నీరసంగా దిగలాగుతున్నాయి.

“అత్తయ్యా! మెలుకువ వచ్చిందా?” యేడుపుగొంతుతో అడిగింది రత్నం. “ఊఁ!” అని మూలిగి మెల్లగా లేవబోయింది కానీ కాళ్ళు సహకరించలేదు. రత్నం వెళ్ళి గౌరికి పొడి బట్టలు తీసుకుని వచ్చింది. గౌరిని మెల్లగా చెయ్యి పట్టుకుని నిలబెట్టింది. బట్టలు మార్చుకుని రత్నం సాయంతో గదిలోకి వచ్చి మంచంమీద వాలిపోయింది గౌరి. రత్నం స్టౌ ఆఫ్ చేసేసి స్టౌదగ్గర శుభ్రంగా కదిగేసింది. కాలిపోయిన చీర చూసి రత్నంకి చాలా బాధకలిగింది. ’మడి, మడి’ చక్కటి కంచి పట్టుచీర రోజూ తడిపేసి ఆరేస్తోంది. పరమాన్నం, పులిహోరా చేసి మూతపెట్టి వుంచింది. కూర అవగానే యింక పూజనైవేద్యం అనుకుంటోంది. ఇంతలోనే యిలా అఘాయిత్యం జరిగింది. సుబ్బయ్య, చలపతి యింట్లో లేరు. వాళ్ళకి కబురుపెట్టి బర్నాల్ ట్యూబ్ తీసుకుని గౌరి గదిలోకి వెళింది. గౌరి మంట, నొప్పి అంటూ ములుగుతోంది.

“అత్తయ్యా! కాస్త పక్కకి తిరగండి బర్నాల్ రాస్తాను, మంట తగ్గుతుంది” అంటూ ట్యూబ్ అంతా రాసేసింది. వీపు యెర్రగా బొబ్బలెక్కి వుంది. “వెంటనే ముందు డాక్టరుని పిలవాలి” అనుకుంది రత్నం.

“సాయంత్రం అయ్యేసరికి రోజూ గౌరి పూజ హడావిడిలో వుండేది. యీరోజు యేమిటో నిశ్శబ్దంగా వుంది” అనుకుంటూ మంగమ్మ మెల్లగా లేచింది. కాళ్ళూ, చేతులూ ఝాడించుకుని నిలబడి కర్ర తాటించుకుంటూ హాలులోకి వచ్చింది. యెవ్వరూ కనబడలేదు.

“గౌరీ! పిల్లా యింకా నీపూజ అవలేదుటే”అని సాగదీస్తూ పిలిచింది. రత్నం గౌరి గదిలోంచి గబగబా వచ్చింది. మంగమ్మతో విషయమ్ చెప్పింది. మంగమ్మ తెల్లబోయింది. “అదేమిటమ్మా”! అంటూ పక్కనే వున్న కుర్చీలో కూల్బడింది. కళ్ళనీళ్ళు తిరిగాయి.

“మామ్మగారూ!”రత్నం మంగమ్మని లేవదీసి గౌరి దగ్గరకు తీసుకెళ్ళింది. “గౌరీ” అంటూ మంగమ్మ మంచం మీద కూర్చుని బావురుమంది.

“ఈ మొగాళ్ళు యెక్కడికి పెత్తనాలికి వెళ్ళారు? కబురెట్టావా?”.

“ఆఁ! కబురు పంపానండీ ఈపాటికి వచ్చేస్తుంటారు.” రత్నం అంటూండగానే వీధివసారాలో చెప్పుల చప్పుడూ, సుబ్బయ్య గొంతుకా వినిపించాయి.

“ఒరే! రావుఁడూ సైకిలేసుకెళ్ళి డాక్టర్ చంద్రాన్ని నించున్న పళంగా రమ్మన్నానని చెప్పు” నౌకరుని పంపి గబగబా గదులోకి వచ్చాడు సుబ్బయ్య. భార్యని చాలా నీరసంగా మంచంమీద చూసేసరికి సుబ్బయ్యకి కాళ్ళూ, చేతులూ ఆడలేదు. ఎప్పుడూ వేళాకోళంమాటలూ, వెక్కిరింతలతో వుషారుగా వుండే గౌరి మంట, నీరసంతో పడుకోలేక, కూర్చోలేక అవస్థ పడుతోంది.

“గౌరీ! కాస్త వోర్చుకో. డాక్టరుకి కబురెట్టాను. వచేస్తాడు” వోదార్పుగా అంటూ భార్య చెయ్యి పట్టుకుని పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. చలపతికూడా వచ్చేశాడు. ఏకంగా డాక్టరుని వెంటబెట్టుకునే వచ్చాడు. డాక్టర్ చంద్రం సుబ్బయ్యకుటుంబానికి బాగా తెలిసిన వాడు. ఈ మధ్యనే వూళ్ళో స్వంత ప్రాక్టీసు మొదలు పెట్టాడు. రాగానే గౌరి వీపుమీదగాయం బాగా పరీక్ష చేశాడు. అంతా సాధ్యమైనంత వరకూ క్లీన్ చేసి ఆయింట్‍మెంటు మొత్తంగా పూశాడు.

“జ్వరం లేదు, బీపీ కాస్త హెచ్చుగా వుంది. షాకుతో వణుకు వచ్చింది. పైచర్మమే కాలిందండీ! మరీ డీప్‌గా యేమీ డామేజీ లేదు. బొబ్బలెక్కడం మంచిదే. త్వరగానే నయమవుతుంది” అని ధైర్యం చెప్పి ఆపూటకి నిద్రకో మాత్ర, బీపీకో మాత్ర వేసుకోమన్నాడు. యాంటీసెప్టిక్ టాబ్లెట్స్ కోర్సువాడమని రాసిచ్చాడు. “గాయానికి బట్టరాపిడి అవకుండా జాగ్రత్త పడండి, కట్టు యేమీవద్దు” అని చెప్పి వెళ్ళాడు. ‘బట్ట రాపిడి అవకుండా యెలాగ’ రత్నం ఆలోచనలో పడింది. జాకట్టు కట్టుకోడం కష్టం. నైటీలు తెప్పించి అంతవరకూ జాకట్టు లేకుండా వట్టి చీర మాత్రం చుట్టబెట్టింది, గౌరికి. నైటీ తొడిగి, గాయం వున్నంతమేరా కత్తిరించి బట్ట తీసేసింది.

“అత్తయ్యా! కాస్త వొత్తిగిలి పడుకోండి. రెండురోజుల్లో మానడం మొదలుడుతుంది” అని గౌరికి ధైర్యం చెప్పింది రత్నం. చలపతి భోజనం ప్లేట్లో పెట్టి తల్లి దగ్గర కూర్చుని తినిపించాడు. మాత్రలు వేసుకుంది, వేడిపాలు తాగి పడుకుంది గౌరి. ఈలోగా మంగమ్మ, సుబ్బయ్య టిఫిను తిన్నారు. తల్లికి అన్నీ సదుపాయంగా అమిరాయి అన్న తృప్తి కలిగాక చలపతికూడా వచ్చి భోజనానికి కూర్చున్నాడు. అప్పుడు రత్నం అంతా వివరంగా ముగ్గురికీ చెప్పింది. “అదృష్టం, పెద్దగండం తప్పింది” అని నిట్టూర్చారు.

“చలపతీ! పిల్లలికి ఫోనుచేసి చెప్పరా” అన్నాడు సుబ్బయ్య.

“ఇప్పుడే చెప్తే ఖంగారు పడతారు నాన్నా! రెండురోజుల్లో తగ్గుముఖం పట్టాక ఫోన్ చేస్తాను” చలపతి తండ్రితో నచ్చచెప్పినట్లుగా అన్నాడు.

“నాన్నా! ఈ రాత్రి మీరు ’కాంపోజ్’ వేసుకుని పడుకోండి. నేను హాల్లోనే పడుకుంటాను. నాన్నమ్మా! నువ్వు గదిలో పడుకోగలవా? హాల్లో పడుకుంటావా?” మంగమ్మని అడిగాడు.

“హాల్లో మరీచలిగా వుంటూందిరా! ఫర్వాలేదులే. గదిలోనే పడుకుంటాను” అని మెల్లగా గదిలోకివెళ్ళి బొంత కప్పుకుని పడుకుంది మంగమ్మ. కానీ యెంతసేపటికీ నిద్ర పట్టలేదు. కళ్ళముందు నిస్త్రాణగా పడుకుని వున్న గౌరి మెదుల్తోంది. “యెంతలో యెంత ప్రమాదం తప్పింది!” అనుకుంది. కళ్ళనీళ్ళు తిరిగాయి. బొంగరంలా చలోక్తులతో యెప్పుడూ సందడిగా వుండే గౌరి బేలగా మూగబొయి ముడుచుకున్న పావురంలా మంచంమీద పడుకుని వుండడం మంగమ్మకి చాలా బాధగా బెంగగా వుంది. “భగవంతుడా! పిల్ల త్వరగా కోలుకునేలా చెయ్యి తండ్రీ!” అని భగవంతుడికి మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకుంది. పొడిబారిన కళ్ళు మూసుకుని పడుకున్న మంగమ్మకి యెప్పటికో నిద్ర పట్టింది.

తరువాయి భాగం – జనవరి 23

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to నందిని 2

  1. radharaopv అంటున్నారు:

    బాగుంది.. ఒక ఆక్సిడెంట్ సృష్టించావు…ఏమౌతుందో వారందాకా ఆగాలి..ఈలోపుగా మానిపోతుందా?నందిని విదేశాలలో చదువుకుంటుందా?అన్నీ ప్రశ్నలే!

  2. Ramana అంటున్నారు:

    Good. Nandini’s opinion is justified.

వ్యాఖ్యానించండి