మన సినిమాలు- నాడు- నేడు
ప్రియమైన పాఠకులకి అనేక నమస్కారములు. మళ్లా మీతో కబుర్లు చెప్పడానికి నేను వచ్చాను. ఈసారి నా విషయాలు కాదు, మన సినిమాలు గురించి. వింటారా మరి! నేను సినిమా గురించి ఏమి చెప్తానా! అని సందేహమా! మనకి విజ్ఞానము , దానితో బాటు వినోదమూ రెండూ ముఖ్యమే కదా! విజ్ఞానము మనకి పుస్తక పఠనము ద్వారా లభిస్తుంది. కొంతవరకూ వినోదము, మానసిక వుల్లాసమూ కూడా పుస్తకాల ద్వారా లభ్యమే. కానీ పూర్వకాలములో విద్య అందరికీ అందుబాటులో వుండేదికాదు. అలాంటి కాలములో బుర్రకధలూ, హరికధలూ , యక్షగానములూ బాగా ప్రజాదరణ పొందాయి. వాటికి పాలకుల వెన్ను దన్ను బాగా వుండేది. ఊరూరూ తిరిగి రాజుల కీర్తి ప్రఖ్యాతలు స్తోత్రం చేసేవారు. కాలక్రమములో అవి మెల్లిగా రాజులకీ గ్రామములకే పరిమితమై వుండిపోయాయి. తరవాత క్రమంగా సామాన్య ప్రజల కొరకు నాటకాలు మొదలుపెట్టారు. అవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఊరూరా తిరిగి అనేక నాటక కంపెనీలు అనేక పౌరాణిక నాటకాలు ప్రదర్శించి ప్రజాదరణ పొందాయి. కొన్ని సాంఘిక నాటకములూ ప్రదర్శించారు. సమకాలీన సమస్యలకి అద్దం పట్టారు. కాలక్రమేణా ప్రజలు కొత్తదనము కావాలి అని కోరుకున్నారు. పట్టణములలో విద్యావంతులు ఎక్కువై, వారు వినోదము ఏవిధముగా లభిస్తుందా అని అన్వేషణ ప్రారంభించారు. ఒక విధముగా పరిశోధించి చలనచిత్రములు …అదే మన సినిమాలు కనిపెట్టారు. ఆరోజుల్లో అది నిజముగా ఒక అద్భుతమే! ప్రత్యక్షముగా కళాకారులని చూసిన ప్రజలు..సినిమా ఒక బొమ్మ అని నమ్మలేకపోయారు. స్థిర చిత్రములూ, మూగ చిత్రములూ, మాట, పాటల చిత్రములూ అన్నీ సమానముగా ఆదరించారు. పరవశించారు. క్రమేపీ సినిమాలు ప్రజల హృదయములో స్థిర పడ్డాయి. మొదట పౌరాణికాలూ, జానపదాలూ,తరవాత సాంఘికాలూ, అన్నీ చూసిన అనుభూతులు చెందుతూ… హాస్యమునకి నవ్వి, సుఖములకి సంతోష పడి, కష్టాలకి కన్నీరు పెట్టుకుని , సంగీతమునకి మైమరచిన ప్రేక్షకుడు నవరసములూ సినిమా మాధ్యమము ద్వారా ఆస్వాదించారు. మా చిన్నతనములో మేము వేడుకగా కుటుంబ సమేతముగా సినిమాకి వెళ్లడం మాకు నిజంగా పండుగలా వుండేది. అందరూ కళాకారులని తమ హృదయములో ప్రతిష్టించుకున్నారు, స్వంత కుటుంబసభ్యుల వలె ఆదరించారు. వారిని అక్కున చేర్చుకున్నారు. ఇంతగా ప్రజాదరణ పొందిన కళాకారులు ధన్యులు. పంచరంగుల సినిమాలు వచ్చాయి. సాంకేతికముగా ఎంతో అభివృద్ధి చెందిన సినీ పరిశ్రమ మరిన్ని హంగులతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విదేశములలో చిత్రీకరించిన పాటలూ, వారి దుస్తుల సోయగాలూ…వహ్వా!తెర మీద విదేశి అందాలు చూసి ఆనందం చెందేవారు. తెర వెనుక ఎంతో మంది కార్మికులూ, కళాకారులూ, ప్రదర్శన థియేటర్లూ అన్నీ సినీ పరిశ్రమని పూర్తిగా నమ్మి జీవనము సాగిస్తున్న తరుణములో….పిడుగు వలే ప్రపంచాన్ని గడగడలాడించి కుదిపేసిన మహమ్మారి కరోనా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థని చిన్నాభినం చెసింది. పెద్దా-చిన్నా పరిశ్రమలు మూల పడ్డాయి. వర్తక వ్యాపారాలు మూసుకుపోయాయి. సినీ పరిశ్రమ కూడా దానికి మినహాయింపు కాదు. వలస కార్మికులు జీవనోపాధి కోల్పోయి అల్లాడిపోయారు. సామాన్య ప్రజలు ఈ మహమ్మారి విజృంభణతో భయభ్రాంతులయ్యారు. ఈ సమయంలో వినోదమూ కరువై బ్రతుకు అంటేనే భయముతో కృంగిపోయారు. మరి మన యువత వూరికే చేతులు కట్టుకుని వుండలేక పోయారు. తమ సాంకేత పరిజ్ఞానము రంగరించి సినిమా నిర్మాణము మొదలు పెట్టారు. పెద్ద పెద్ద హంగులు లేకుండా, పెద్దగా కళాకారులు లేకుండా , కొత్త కధలతో నిర్మించిన సినిమాలు విడుదలకి నోచుకోలేదు. థియేటర్ల తలుపులు మూసుకుని వున్నాయి. దానికీ ఒక మార్గము ఆలోచించారు మన యువత. థియేటరు బయట ఇంట్లోనే సినిమా చూడగలిగే వేదికలు ఏర్పాటు చేశారు.
క్రమేపీ అవి ప్రజాదరణ పొందాయి. విజయ దుంధుభి మోగించాయి. చిన్న కధలతో ప్రజలని ఆకట్టుకున్నాయి. విదేశాలలో వున్న నాలాంటి సీనియర్లకి కూడా అందుబాటు లోకి వచ్చాయి. ఈ విజయానికి మన యువతే కారణము. వారిని ఎంత అభినందించినా తక్కువే! గడ్డు కాలము ముగిసి , తిరిగి సినీ పెద్దల కృషితో పరిశ్రమ నిలబడి, మనకి ఆనందము పంచుతుందని నాప్రగాఢ విశ్వాసము. అంతవరకూ మనకి అంతులేని వినోదము అందచేస్తున్న యువతకి జేజేలు! వారి సాంకేతిక పరిజ్ఞానమునకు నా జోహార్లు. జై హింద్!
సెలవా మరి. నేనూ విశ్రాంతిగా కూర్చుని సినిమా చూడాలి కదా! సర్వే జనా సుఖినో భవంతు..ఓం శాంతి.
మీ కృష్ణవేణి.
నా ఓటు ఇంట్లో మంచం మీద పడుకుని సినిమా చూడటానికే. భవిష్యత్తులో థియేటర్లలో సినిమాలు బాగా తగ్గిపోతాయ్ అనిపిస్తోంది నాకు. యువత మాత్రం థియేటర్లలో చూడడానికి ఇష్టపడుతున్నారు.